శ్రీ మహాభాగవతం

ధారావాహికం                                                                                             డా॥ పులిగడ్డ విజయలక్ష్మి 


పరీక్షిన్మహారాజా! కలియుగంలో నరపాలురు నేర్పరులై భూమిని పరిపాలిస్తారు. కాని వారి మోహాన్ని అణచుకోలేరు. కాలం చంచలమైనదన్న నగ్నసత్యాన్ని గ్రహించలేరు. రాజులు నిజంగా గొప్పవాళ్ళే. వాళ్ళ మహిమను ఆదిశేషుడే పొగడలేడనుకో. భూమిని చాలాకాలం ఏలుతారు. కాని ఏమి లాభం? భ్రాంతులై భూమిలోనే కలిసిపోతారు.


"గుజ్రాలు, ఏనుగులు మొదలైన బలగాలను గాని, సిరిసంపదలను గాని - అవి శాశ్వతంగా ఉంటాయని ఎప్పుడూ నమ్ముకోకూడదు.కంగారుపడకుండా, దేని గురించి విపరీతంగా ఆలోచించకుండా, శాంతచిత్తంతో నిత్యం శ్రీ హరిని తలచే సజ్జనులు ఆ పరమాత్మునిలోనే చేరిపోతారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోలేరు".


కణ్వ వంశం గురించి ఇంతకు ముందు నీకు వివరంగా చెప్పాను గదా! ఆ వంశంలోనే ఒకప్పుడు సుశర్ముడు అనే రాజు ఉండేవాడు. అతని దురదృష్టం వల్ల అతని సేవకుడైన వృషలుడనే అంధ్ర జాతీయుడతనిని హింసించి రాజ్యానికి ఏలిక అయినాడు. ఆ వృషలుడు అధర్మమార్గంలో సంచరిస్తూ మహాపరాక్రమవంతుడై రాజ్యపాలన చేస్తాడు. అతని తరువాత అతని తమ్ముడు కృష్ణుడనేవాడు రాఔతాడు. కృష్ణుడి వంశం పరంపరగా - మొత్తం నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాల కాలం రాజ్యపాలన చేస్తుంది. ఆ రాజులందరూ - ఎవరంటావేమో? విను. కృష్ణుడికి - శాంతకర్ణుడు; అతనికి - పౌర్ణమాసుడు; అతనికి -లంబోదరుడు; అతనికి - సిబిలకుడు; అతనికి - మేఘస్వాతి; అతనికి - దండమానుడు; అతనికి - హాలేయుడని చెప్పబడే అరిష్టకర్మ; అతనికి - తిలకుడు; అతనికి పురీషసేతుడు; అతనికి - సునందనుడు; అతనికి - వృకుడు; అతనికి - జటాపుడు; అతనికి - శివస్వాతి; అతనికి - అరిందముడు; అతనికి - గోమతి; అతనికి - పురీమంతుడు; అతనికి - దేవశీరుడు; అతనికి - శివస్కందుడు; అతనికి - యజ్ఞశీలుడు; అతనికి - శ్రుతస్కందుడు; - అతనికి - యజ్ఞశత్రుడు; అతనికి - విజయుడు; అతనికి - చంద్రబీజుడు; అతనికి - సులోమధి పుత్రులుగా జన్మించి వరసగా రాజ్యపాలన చేస్తారు. అంతేకాక ఇంకా అనేకానేక మంది క్రమంగా పుట్టి పరిపాలకులుగా ప్రసిద్ధి చెందుతారు. -


ఆ తరవాత నాభీర వంశంలోని వారు ఏడుగురు, గరుభవంశజులు పదిమంది, కంకవంశీయులు పదహారు మంది భూభారాన్ని వహిస్తారు. తదుపరి ఎనిమిది మంది యవనులు, బర్బరీవంశీయులు పధ్నాలుగు మంది రాజులై పరిపాలిస్తారు. తరవాత పదమూడు మంది గురుండులు, పదకొండు మంది మౌనులు, గర్విష్ఠులై పంథొమ్మిది వందల తొమ్మిది సంవత్సరాల కాలం నిరాఘాటంగా రాజ్యపాలన చేస్తారు. తరవాత మౌనవంశంలో జన్మించిన పదకొండు మంది ఈర్యాగ్రస్తులు మూడు వందల సంవత్సరాలు మహీపతులుగా అధికారం చలాయిస్తారు. అదే సమయంలో శైలికిలులు అనే యవనులు రాజులై భూమిని పాలిస్తారు. ఆ తరవాత నూటారు సంవత్సరాలు భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, శిశునందుని తమ్ముడైన యశోనందుడు, ప్రవీరకుడు అనేవాళ్ళు మహావీరులై రాజ్యపాలన కావిస్తారు. ఆ రాజులకు పదమూడు మంది పుత్రులు జన్మిస్తారు. ఆ పదముగ్గురిలో ఆరుగురు బాహ్లిక దేశానికి రాజులౌతారు. మిగిలిన ఏడుగురు పుత్రులు కోసల దేశానికి అధిపతులౌతారు.


అప్పుడు వైడూర్యపతులు - నిషధ దేశానికి ప్రభువులుగా రాజ్యపాలన చేస్తారు. పురంజయుడనేవాడు మగధ దేశానికి అధిపతియై హరిభక్తి లేక చెడిపోతున్న ఎందరికో ధర్మోపదేశం చేస్తాడు. పుళింద, యదు, మద్రదేశాలలో నివసిస్తున్న హీనజాతి జనులు బ్రహ్మజ్ఞాన రహితులై ఉండగా, వారికి పరమాత్మను గురించి తెలియజెప్పి, వారిలో హరిభక్తిని పాదుకొల్పి, వారిని సజ్జనులుగా, సద్భక్తులుగా తయారు చేస్తాడు. శౌర్యశీలురైన క్షత్రియ వంశాల వారిని అణచివేసి పద్మావతీ నగర పాలకుడౌతాడు. గంగానది నుంచి ప్రయాగ వరకు ఉన్న ధరణినంతా పాలిస్తాడు. నాస్తికులయిన బ్రాహ్మణులు, శూద్రప్రాయులైన రాజులు - సౌరాష్ట్రానికి, అవంతీ దేశానికి, ఆభీర రాజ్యా నికి, అర్బుద రాష్ట్రానికి, మాళవ దేశానికి అధిపతులై పాలన సాగిస్తారు.


సింధుతీరంలోను, చంద్రభాగా ప్రాంతంలోను, కాశ్మీర మండలంలోను ఛఛ్చాకారులగు రాజులు భూమిని పాలిస్తారు. వారు బుద్దిహీనులై ధర్మం, సత్యం, దయ అనే వాటిని మరచిపోయి క్రోధ మాత్సర్యాలతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తిస్తుంటారు. స్త్రీలను, బాలురను, గోవులను, బ్రాహ్మణులను వధించడానికి వెనుకాడరు.పరధనమన్నా,పరస్త్రీ అన్నావ్యామోహంతో సొంతం చేసుకొంటారు. రజోగుణంతో, తమోగుణంతో అల్పజీవులుగా వ్యవహరిస్తారు. పరాక్రమశూన్యులై, దుర్బలులై కాలం గడుపుతుంటారుశ్రీ మహావిష్ణు పాదారవిందాలను భజింపక, సత్త్వగుణ సంపన్నులు గాక తమలో తాము వైరాన్ని పెంచుకొని యుద్ధభూమిలో ఒకరి చేతిలో మరొకరు హతులౌతుంటారు. ఆ కాలంలో ప్రజలు కూడా రాజుల వేషభాషలను, ప్రవర్తనాదులను అనుసరిస్తారు. పరీక్షిత్తూ! కలికాలం ఎంత దుర్భరంగా ఉంటుందంటే!


"దినదినమును ధర్మంబులు ననయము ధరనడగిపోవు నాశ్చర్యముగా విను వర్ణ చతుష్కములో నెనయగ ధనవంతుడైన నేలు ధరిత్రిన్"


"ఎప్పుడైతే రాజులధర్మ ప్రవర్తకులౌతారో అప్పుడే లోకంలో ధర్మం నశించిపోతుంది. ఆశ్చర్యమేమిటంటే - రోజు రోజుకు లోకంలో ధర్మం క్షీణిస్తుంది. ఎవరి ధర్మం వారు పాటించడం మానివేస్తారు. నాలుగు కులాలలోను ఎవడు గొప్ప ధనవంతుడయితే అతడే రాజ్యపాలకుడవుతాడు. తక్కినవారిని అణగదొక్కడం అతనికి కష్టమైన పని కాదు. పైగా అందరూ అతని కనుచరులౌతారు గాని, ఎదురు తిరగలేరు. ఇదే కలియుగ ధర్మం అనుకో.


"బలవంతుడైనవాడే కులహీనుండైన దొడ్డ గుణవంతుఁడగుం గలిమియు బలిమియు కలిగిన నిలలోపల రాజతండా; యేమనవచ్చున్?"


బలం కలిగి ఉంటే చాలు అతడు కులహీనుడైనా సరే ప్రజలు గొప్ప గుణవంతుడిగా అతనిని కొలుస్తుంటారు. సిరిసంపదలు, బలపరాక్రమాలు ఉంటే చాలు - అతడే లోకంలో రాజవుతాడు. అంతేకాదు రాజా! కలికాలంలో ప్రజలు లోభగుణంతో దయాహీనులుగా ఉంటారు. జారత్వం, చోరత్వం అలవాటు చేసుకోవటం వల్ల వారివద్దధనంకూడా నిలవదు.అడవుల్లో దొరికే కూరలు, కందమూలాది దుంపలు, పండ్లు తింటూ బ్రతుకుతారు. తట్టుకోలేక భయాందోళనలకు గురవుతారు. ధనహీనులుగా, అల్పాయుష్కులు, కృశీభూత శరీరులుగా ప్రజలుంటే, ఇక రాజులు చోరులై సంచరిస్తారు. అధర్మ ప్రవర్తనతో, వర్ణాశ్రమ ధర్మాలను కడా వదలివేస్తారు. కలికాలంలో ఓషధులు కూడా సత్ఫలితాల నివ్వవంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. వర్షాలు కురవవు. పంటలలో సారం ఉండదు. ఈవిధంగా లోకులందరూ అధర్మ మార్గ ప్రవర్తకులైందువల్ల దుష్టశిక్షణ కోసం విష్ణుమూర్తి అవతారం ఎత్తవలసి వస్తుంది. శిష్టరక్షణ కోసం ఆ పరమేశ్వరుడు శంబల గ్రామంలో విష్ణుయశుడనే విప్రునికి కల్కిగా జన్మిస్తాడు. దేవదత్తమనే అశ్వాన్ని అధిరోహించి దుష్టులైన మ్లేచ్చుల నందరినీ తన ఖడ్గానికి ఎర చేస్తాడు. ఆ దృశ్యం సి దేవతలందరూ కల్కి భగవానుని అనేక విధాల వినుతిస్తారు. అప్పుడు భూమండలమంతా క్రూరజనమంతా నశించిపోవడంతో తేజోమండలంగా ప్రకాశిస్తుంది. ప్రజలందరూ విష్ణుధ్యానంలో మునిగిపోతారు. నారాయణుడికి పూజలు చేస్తూ, ఆయన నామస్మరణతో పునీతులవుతారు.


ప్రతి పనిలోనూ గోవిందుడికి నమస్కరిస్తూ ధన్యులవుతారు. ఈవిధంగా సకల జనులు కల్య్యవతార సమయంలో ఏ కష్టాలకు గురి కాకుండా సంతోషమయ జీవితాలను గడుపుతారు. ఆ కాలంలో భూమండలమంతటా కృతయుగ ధర్మం గోచరిస్తుంటుంది. ఎలాగంటావేమో? చంద్ర సూర్యులు, శుక్ర గురువులు - నలుగురూ ఒకే రాశిలో ఉండడం చేత కల్కిపురుషుని రక్షణలో అది కలియుగమైనా కృతయుగంలాగానే భాసిస్తుంది. పరీక్షిన్మహారాజా! నీవు జన్మించింది మొదలుకొని నందాభిషేకం జరిగిన కాలం వరకు - జరిగిన, జరుగుతున్న, జరగవలసిన కాలం - పదకొండు వందల పదిహేను సంవత్సరాలు. తరువాతి కాలాన్ని నీవు లెక్కించవచ్చు. రాజా! ఈ విధంగా నారాయణుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి, అవతార విధి పూర్తి చేస్తాడు. క్రూరులు, దుర్మార్గులు, అధర్మపరులు అయిన రాజులనందరినీ ధ్వంసం చేసి భూమిపైన మరల ధర్మాన్ని ప్రతిష్ఠించి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వేంచేస్తాడు" అని శుకమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు మరో అంశాన్ని లేవనెత్తాడు.


"మునీంద్రా! చంద్రగ్రహం, సూర్యగ్రహం ఏఏ మార్గాలలో సంచరిస్తాయి? కాలం నడిచే పద్ధతి ఏమిటి! ఇవి చెప్పి నన్ను సంతోషవంతుని చేయి" అని అడగగానే మహర్షి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. రాజా! సప్తర్షి మండలంలోని రెండు పూర్వనక్షత్రాల నడుమ రాత్రివేళలో ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఆ నక్షత్రం కనిపించినప్పటినుంచి మన లెక్కల ప్రకారం నూరు సంవత్సరాలు కనుక గడిస్తే శ్రీ కృష్ణుడు తన నిలయమైన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కృష్ణ నిర్యాణం జరిగిన రోజునే భూమండలంలో కలి ప్రవేశం జరుగుతుంది. శ్రీ కృష్ణుడు భూమిపైన ఉన్నంతవరకు కలి భూమిపైన కాలు పెట్టలేదు. పెట్టలేడు కూడా. సప్తమహరులు ఏరోజున మఖా నక్షత్రంలోకి ప్రవేశిస్తారో - ఆ నాటికి కలి భూమిమీద అడుగుమోపి పన్నెండు వందల సంవత్సరాలవుతుంది. వారు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తే - అప్పటికి కలి బాగా వృద్ధి చెందుతాడు. ఈ విధంగా భూమండలంలోకి కలి ప్రవేశించి వెయ్యి దివ్య సంవత్సరాలు గడిస్తే - ఆ తరవాత నాలుగోపాదంలో కృతయుగ ధర్మం చోటు చేసుకొంటుంది.


పరీక్షిత్తూ! ఇంతవరకూ భూమినేలిన రాక్రే ష్ఠుల పేర్లు వారి గుణాలు, ప్రవర్తనా విధానాలు, సిరిసంపదలు, రూప సౌభాగ్యం, రాజ్యాలు, ధనం - అన్నీ వరసగా అణగిపోయాయి. కాని నేటికీ వారి కీర్తి ప్రతిష్ఠలు భూమిలో నిలిచి ఉన్నాయి. వారు సంపాదించిన యశస్సు - అజరామరమనుకో. శంతన మహారాజు తమ్ముడి పేరు - దేవాది. ఇక్ష్వాకు మహారాజు వంశంలో జన్మించి ఖ్యాతికెక్కినవాడి పేరు - మరుత్తు. దేవాపి, మరుత్తు - ఇద్దరూ కలాప గ్రామంలో నివసిస్తూ యోగమార్గాన్ని అనుసరించారు. వారు కలియుగం చివరి రోజుల్లో వాసుదేవుని వల్ల రేపింపబడినవారై ప్రజలు ఆశ్రమాచారాలు తప్పకుండా ఉండేటట్లు నడిపించేవారు. ప్రతినిత్యం పరమాత్ముడైన నారాయణుని నామస్మరణం చేస్తూ, అంత్యకాలంలో ముక్తిని పొందుతారు. నాలుగు యుగాలలో రాజ్యాలేలిన రాజులు ఇంతకుముందు నేను నీకు చెప్పిన రాజులు - అందరూ సకల వస్తు సముదాయంపైన, భోగభాగ్యాలపైన ఎనలేని మమకారంతో, ఉత్సాహ సంతోషాలతో జీవితాలు గడిపి చివరి రోజులలో మృత్యువు ఒడికి చేరక తప్పదు. కనుక కాలం ఎలా నడుస్తుందో, నడిపిస్తుందో ఎవరికీ తెలియదు. మా పూర్వుల సంగతి చెబుతా విను. వాళ్ళందరు ఎల్లవేళలా విష్ణుధ్యానంలో పరవశులై ఉండేవారు. సకల సద్గుణాలతో శోభిల్లేవారు. దయ, సత్యం, శౌచం, శమము, దమము మొదలైనవన్నీ వారి మనసుల్లో ఇమిడి ఉండేవి. అందుచేతనే వారంతా ప్రసిద్ధులై ఖ్యాతికెక్కారు. ఒక్కమాట చెబుతాను విను.


"భూనాథా! ఏ మనుషులైతే ధర్మగుణంతో, సత్యనిష్టతో నిర్మల కరుణాంతరంగంతో, నిరుపమానమైన సత్కర్మలతో, అహింసా వ్రతాన్ని ఆచరిస్తారో వారే మహాత్ములనుకో! అటువంటి వారికి కీర్తి సులభంగా దక్కుతుంది. వారి విష్ణుభక్తి అచంచల మనుకో. అన్ని సద్గుణాలు గలవారు కాకపోతే మరెవరు పుణ్యమూర్తులౌతారు? నిజమే. కాకపోతే మరొక పక్షంలో - కామపీడితులైన రాజులూ ఉన్నారు. ఈ జగత్తును పరిపాలించిన రాజులు కొందరు సుఖలాలసులై, భోగభాగ్యాలకే ప్రాధాన్యమిస్తూ ఆయుర్దాయాన్ని పోగొట్టుకొని, కాలగర్భంలో కలిసిపోయి, పేరుకు మాత్రం రాజులుగా మిగిలిపోయిన వారూ ఉన్నారు. కాబట్టి 'రాజా మమతానురాగాలకు లొంగిపోయి ప్రవర్తించడమనేది, భవబంధాలలో ఇరుక్కుపోయి మంచిని కనుమరుగు చేసుకోవడమనేది, పరమాత్ముని మఱచి వ్యా మోహపీడితుడై మనుగడ సాగించడమనేది ఎవరికీ, ఎప్పుడూ పనికిరానివని, పనికిమాలినవని గ్రహించి, జాగ్రత్తగా మసలుకొని జీవిత పరమార్థాన్ని తెలుసుకొని నిత్యం పరమాత్ముడైన శ్రీ మన్నారాయణునే తలవాలని, కొలవాలని, ఆయన కరుణనే పొందాలని అర్థం చేసుకో! నీకీ విషయం తెలుసా? గర్వాంధులైన రాజులచూ సి భూదేవి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాజులు శత్రువులను వధించి రాజ్యాన్ని ఎవరికీ దక్కకుండా తామే ఏలుతున్నామని అహంకారంతో ఉంటారు. మోహావేశంతో తండ్రీ కొడుకులకు, అన్నదమ్ములకు మధ్య ఆశ కల్పించి ఎవరికి వారు తామే పదవీ సంపదలను పొందాలని అన్యోన్య వైరంతో యుద్ధానికి దిగుతారు. రణరంగంలో తమ తమ శరీరాలను గడ్డిపరకల వలె ఆహుతి చేసుకుంటారు. స్వర్గలోక ప్రాప్తులైన పృథువు, యయాతి, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, దుందుమారుడు, రఘువు, తృణబిందువు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్సుడు, నిషధుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు, హిరణ్యాక్షుడు, తారకుడు మొదలైన రాజులలో - రాక్షస రాజులు కూడా భూమిపైని మమకారం చేతనే, అధికారమందలి వ్యామోహం చేతనే కాలవశాన నాశనమందారు. అది అంతా కేవలం మిథ్య. ఈ భూమినాది, ఆ రాజ్యం నాది అని అనుకోవటం భ్రాంతి అవుతుంది. సత్యమైనది పరమాత్మతత్త్వం ఒక్కటే.


పరీక్షిన్మహారాజా! అందుచేత సర్వ విషయాలను పరిత్యజించాలి. కామాదులను విసర్జించాలి. చేయవలసింది - నిరంతర హరికథామృతపానం. . "జనార్ధన, వైకుంఠ, వాసుదేవ, నృసింహ" అంటూ శ్రీ మన్నారాయణుని వేయి నామాలను స్మరిస్తూ, ఏకాగ్రచిత్తంతో ఆయన పాదాలను ధ్యానిస్తూ ఉంటే వార్ధక్యాన్ని, అనేకానేక రోగబాధలను పోగొట్టుకొని విష్ణుపదాన్ని చేరుకొంటారు. నీవు కూడా ఆ విధంగా చేసి సద్గతిని పొందు.


"ఉత్తముల చేత స్తుతింపబడేవాడు, సమస్త దిశలయందు సర్వుల చేత కీర్తింపబడేవాడు ఎవడైతే ఉన్నాడో - ఆతడే ఈశ్వరులకే ఈశ్వరుడైన పరమేశ్వరుడు. ఆ భగవంతుని, ఆ వరదాతను నీ మనసులో దృఢంగా నిలుపుకో. పరమాత్ముని సకల సద్గుణాలను, విశేష మహిమలను అనుక్షణం వర్ణిస్తూ ఉండు. తలపోస్తూ ఉండు" అని శుకమహర్షి బోధించి క్షణకాలం ఆగాడు . -


అప్పుడు పరీక్షిత్తు తన మదిలో మెదిలిన ప్రశ్నను ఆ యోగీంద్రుడికి విన్నవించాడు. "మహాత్మా! కలియుగం అంటేనే పాపసమ్మిళితం గదా! మరి ప్రజలు తమను పాపాలంటకుండా ఉండేందుకు ఏం చేస్తారు? కలియుగంలో కాలం ఎలా నడుస్తుంది? కాలస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ప్రభావం ఏవిధంగా మానవులకు తెలుస్తుంది? ఈ లోకాలు ఎలా నిలుస్తాయి? వివరంగా చెప్పండి". వెంటనే శుకయోగి చెప్పటం మొదలుపెట్టాడు.


యుగధర్మప్రాకృతాది ప్రళయ చతుష్టయ వివరణ


రాజా! కృతయుగం, త్రే తాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని యుగాలు నాలుగుగా చెప్పబడ్డాయి. ఈ నాలుగూ వరుసగా ఒకదాని తరువాత మరొకటి ప్రవర్తిస్తాయి. యుగధర్మమనేది చాలా ముఖ్యమైనది. ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. సత్యం, దయ, తపస్సు, దానం అనేవి ఆ నాలుగు పాదాలు. అంతేకాక, ధర్మం, శాంతి, దాంతి, ఆత్మజ్ఞానము, వర్ణాశ్రమాచారాలు మొదలైనవాటితో ఒప్పుతూ అందరికీ ఆచరణ యోగ్యంగా ధర్మము శాంత్యాదులను కలిగి ఉండి, కృతయుగంలో నాలుగు పాదాలను పరిపూర్ణంగా నిలుపుకుంటూ ప్రవర్తిల్లుతుంది. అంటే మొదటి యుగమైన కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందన్నమాట. రెండవ యుగమైనతే తాయుగంలో ధర్మం శాంతి దాంతి కర్మాచరణ రూపంతో మూడు పాదాల మీద నడుస్తుంది. మూడవ యుగమైన ద్వాపరయగంలో ధర్మం విప్రార్చన, అహింస, వ్రతం, జపానుషానం మొదలైన లక్షణాలతో రెండు పాదాల మీద నడుస్తుంది. ఇక నాల్గవ యుగమైన కలియుగంలో ప్రజలు ధర్మహీనులుగా, అన్యాయాలు చేసేవారిగా, అరిషడ్వర్గాలయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే దుర్గుణాలతో సంచరించే వారిగా, దురాచారాలతో ప్రవర్తించే వారిగా, దుష్టాన్నాన్ని భుజించేవారిగా, శూద్రుల సేవలను ఇష్టపడేవారిగా, నిర్దయులుగా, నిష్కారణంగా వైరం పెంచుకొనేవారిగా, దయను, సత్యాన్ని, శౌచాన్ని పాటించనివారుగా, అబద్దాలాడేవారిగా, మాయోపాయాలు పన్నేవారిగా, ధనహీనులుగా, ఎదుటివారిలో దోషాలు మాత్రమే ఎంచేవారిగా - జీవనం సాగిస్తారు.


పాపాత్ములైన రాజులను సేవిస్తారు. తల్లితండ్రులను,సోదరులను, పుత్రులను, బంధువులను, దాయాదులను, మిత్రులను, సజ్జనులను వదలివేస్తారు. మద్యం పైన, కామం పైన అపేక్షతో కులాన్ని చెడగొడుతుంటారు. కలియుగానికి సంబంధించిన మరో విశేషం రాజా! కరువు కాటకాలతో ప్రజాక్షయం ఎక్కువగా జరుగుతుంది. బ్రాహ్మణులు స్వీకరింపకూడని దానాలు తీసుకుంటూ హీనులైపోతారు. అంతేకాదు, ఇతరుల ధనాన్ని కైవసం చేసుకోటానికే యజ్ఞ యాగాలు చేస్తుంటారు. ఇలా నీచ గుణాలకు అలవాటు పడటం వల్ల నశించిపోతారు. కాబట్టి ఈ వాసుదేవసంకర్షణ" మొదలైన విష్ణు సహస్రనామాలతో ఆహరిని తలచేవారికి నూరు యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలం సంప్రాప్తిస్తుంది. పరీక్షిన్మహారాజా! నేను చెప్పినది గుర్తుంచుకొని నీ మనసులో ప్రతి నిముషం నిశ్చలమైన భక్తితో మన్నారాయణుని స్మరించు. కలియుగం అనేక పాపాలకు నిలయమని చెబుతారు. ఒక్క నిముషమైనా సరే విడువని భక్తితో విష్ణుమూర్తిని గురించి ధ్యానం చేస్తే పాపాలన్నీ తొలగి పవిత్రత చేకూరుతుంది. నీవావిధంగా చేసి వాసుదేవుని తలుస్తూ కృతార్థుడివి కా!


"ఇప్పుడు మూడవ యుగం కదా. ఎక్కడ కలి అరిష్టాలను కలిగిస్తాడో, ఎప్పుడు తన ప్రతాపాన్ని మనమీదూ పించి మనల్ని భ్రష్టుల్ని చేసి వినోదిస్తాడో అనే భయంతో ద్వాపర యుగంలోనే భక్తులందరూ "కృష్ణా" అని విష్ణు నామాన్ని స్మరిస్తూ హరి మహిమలు గానం చేస్తూ ఆ పరమాత్ముని సేవలోనే తరిస్తున్నారు" అని చెప్పి శుకమహర్షి కొద్దిసేపు మౌనం వహించాడు. శుకుడు తనపైన ప్రసన్న వీక్షణాలు పరపడూ సి పరీక్షిత్తు తన ఆలోచనను బయటపెట్టాడు.


"స్వామీ! కల్ప ప్రళయ ప్రకారం ఎలాంటిది? చెప్పండి" అని అడగడంతో తల పంకించి శుకుడు చెప్పటం మొదలుపెట్టాడు. "రాజా! ఈ నాలుగు యుగాలు వరుసగా వెయ్యిసార్లు గడిస్తే - బ్రహ్మదేవుడికి ఒక పగలు జరుగుతుందనుకో. అట్లాగే మళ్ళీ నాలుగు యుగాలు మరో వెయ్యిసార్లు గడిస్తే - విధాతకు ఒక రాత్రి గడచినట్లు. ఈ విధంగా బ్రహ్మదేవుడికి ఒకరోజు జరిగితే దానిని "నైమిత్తిక ప్రళయమం"టారు. బ్రహ్మ - తన రాత్రి వేళలో - లోకాలనన్నిటినీ ఆత్మలో నిలిపినిద్రిస్తాడు. ఎప్పుడైతే లోకాలన్నీ బ్రహ్మదేవుని ఆత్మలోకి చేరిపోతాయో అప్పుడు సమస్త ప్రకృతి అంతరించిపోతుంది. దానిని 'ప్రాకృత ప్రళయమ'ని చెబుతారు. పగలు నైమిత్తిక ప్రళయము, రాత్రి ప్రాకృత ప్రళయము జరిగితే - అదే 'ప్రళయ ప్రకారమ'ని తెలుసుకో. ఇటువంటి ఒక పగలు, ఒక రాత్రి గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజుగా చెప్పబడుతుంది. ఇటువంటి రోజులు మూడువందల అరవై గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం గడిచినట్లు. అటువంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు అవసాన కాలం వచ్చినట్లు."బ్రహ్మదేవుడికి అవసాన కాలం వచ్చినపుడు భూమిపైన నూరేళ్ళపాటు వరాలు కురవవు. ఎప్పుడైతే నీళ్ళు లేవో మానవులు దీనస్థితికి దిగజారుతారు. ఆకలి దప్పులకు తట్టుకోలేక చిక్కి శల్యమౌతారు. ఆకలిబాధను భరించలేక నరులు ఒకరినొకరు తింటూ కాలవశాన మరణిస్తారు. ఆ సమయంలో సూర్యుడు తన తీక్షణమైన సహస్ర కిరణాలతో సముద్రాలలోని జలాలను, జీవుల శరీరాలలోని రసాలను, భూమిలో పుట్టే రసాలను కాల్చివేస్తాడు. అలా ఏర్పడిన కాలాగ్నికి 'సంకర్షణమ'ని పేరు. ఆ కాలాగ్ని సృష్టిలోని అన్ని దిక్కుల చివరి వరకు వ్యాపిస్తుంది. అప్పుడు నూరు సంవత్సరాల పాటు ఆగకుండా లోకమంతటా వాయువులు వీస్తాయి. ఈ విధంగా నూరు సంవత్సరాల పాటు ఎక్కడా వర్షాలు పడకుండా భూమి ఎండిపోతుంది. తరువాత నూరు సంవత్సరాలు భానుని ప్రచండ కిరణలు తాండవిస్తాయి. ఆ తరవాత నూరు సంవత్సరాలు లోకమంతా ప్రళయాగ్ని చేత దహింపబడుతుంది. పిమ్మట సప్త వాయువుల ఝంఝా నిలం వేగవంతమై ప్రజలను పీడిస్తుంది. అప్పుడు నూరు సంవత్సరాల కాలం మేఘాలు, ఉరుములు, పిడుగులతో బీభత్సంగా మహాధ్వని చేస్తూ ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షాలు కురిపించి భూమినంతటినీ జలమయం చేస్తాయి. బ్రహ్మాండమంతా అప్పుడు నీటిమయం అయిపోతుంది. (సశేషం)