భగవద్గీత - మోక్షసన్న్యాస  యోగం 18 అధ్యాయం


భగవద్గీత


 మోక్షసన్న్యాస  యోగం 18 అధ్యాయం                  గత సంచిక తరువాయి


సముద్ర లంఘనం, సీతా సందర్శనం, అశోకవన ధ్వంసం, లంకా దహనం, సీతా సందేశం, రావణునికి హితోపదేశం, చూ శానుసీతనని శుభవార్త రామునికి చెప్పడంలో హనుమంతుని కార్యదక్షత అనితర సాధ్యం. అమోఘం. అద్భుతం. దేశకాల పరిస్థితులను బట్టి పాత్రనెరిగి దానం చేయాలి. బలి శిబి రంతిదేవుల దానం అపూర్వం. శతథా ప్రశంసనీయం. ఈశ్వరభావం అన్న శబ్దం రాజులకు తగిందే. శాసనాలు ప్రజలకే కాదు ప్రభువులకు కూడా వర్తిస్తాయి. రాజుగారని మినహాయింపు ఉండదు. సత్య ధర్మన్యాయాచరణలో ఆదర్శంగా నిలవాలి రాజు. సమర రంగంలో శత్రువుకి భయపడి మడమ తిప్పి పారిపోరాదు. ఇది క్షత్రియునికి ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఈ ఏడూ క్షత్రియుని స్వభావానికి చెందిన రాజస గుణ కార్యాలు. బాగా ఆలోచిస్తే నిజ జీవితంలో మనం కూడా యుద్ధం చేసే వీరులమే. ఉత్తిష్ఠ యుద్దాయ కృతనిశ్చయి. యుద్ధం చేయటానికి నిశ్చయించుకొని లెమ్ము. (2-37) - అది భగవత్ సందేశం. అర్జునునికే కాదు సాధకులమైన మనందరికీ వర్తిస్తుంది ఆమాట. పరమాత్మని చేరుకోవాలనే లక్ష్యసాధనలో అసుర సంపత్తిని ఎదుర్కొని పోరాడటంలో నిరాశ చెంది వెనుతిరగరాదు. పట్టుదల వదలని విక్రమార్కునిలా దైవీ సంపదని కూడదీసుకుని సడలిపోని ధైర్యంతో దక్షతతో యుద్ధం చేసి విజయలక్ష్మితో గమ్యం చేరాలి. లక్ష్యం చేరితే మోక్షం. మధ్యలో చనిపోతే యోగభ్రష్టులం కాలేం. శ్రీ మతాంగేహే (6–41) పవిత్రులైన యోగుల భక్తియే సంపత్తిగా గల ఇంట్లో జన్మించగలం. ఆగిపోయిన చోటు నుంచి సాధన చేసి లక్ష్యం చేరుకోగలం.


కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మస్వభావజమ్ | పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ || 44


కృషి గోరక్షణం వాణిజ్యం వైశ్య స్వాభావిక కర్మలు. సేవా రూపమైన కర్మ శూద్రులకు సహజసిద్ధం.


కృషి అంటే వ్యవసాయం. నాలుగు వర్ణాల వారికి తగినంత ఆహార ధాన్యాలు అందించాల్సింది వైశ్యులే. ఆయా కాలాలకు తగిన పంటలను పండించాలి. ఆహార పంటలే కాక వాణిజ్య పంటలు నువ్వులు, వేరుశనగ, ప్రత్తి తదితరాలను కూడా పండించాలి. గోరక్షణం కూడా వైశ్యులదే. పాడి పంటల బాధ్యత ఎంతో శక్తి యుక్తులతో ఓర్పుతో కూడుకున్నది. వాణిజ్యం అంటే వ్యాపారం. వ్యాపారం ద్రోహచింతనం అనే సూక్తి ఉంది. అదెలా వచ్చిందో, ఎపుడు వచ్చిందో తెలియదు. అది ఈ కాలానికి బాగా వర్తిస్తుంది. అన్ని సరకులూ కలీ. చివరికి మంచినీరు కూడా కలుషితమే. మోసం దగాలకు హద్దూ పద్దూ లేకుండా పోతోంది. ఒకనాటి కాలంలో న్యాయబద్ధమైన రీతిలో వ్యాపారం ఉండేది. కొలతల్లో తూకంలో ఇచ్చి పుచ్చుకునే వడ్డీ లెక్కల్లో మోసం కపటం, కలీ, దొంగతనం ఇత్యాదులకు ఆస్కారం లేదు. వ్యాపారమంటే నిజాయితీకి స్వార్థ రాహిత్యానికి మారుపేరుగా ఉండేది. పశూనాం రక్షణాం... వణికృధంచ వైశ్యస్య కృషి మేవచ... ఏకమేవతు శూద్రస్య శుశ్రూషాం అనసూయ యా అంటుంది మనుస్మృతి.


ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో ఓ విశేషం ఉంది. బ్రాహ్మణులకి తొమ్మిది లక్షణాలు, క్షత్రియునికి ఏడు లక్షణాలు, వైశ్యునికి మూడు, శూద్రునికి ఒకే ఒక పని చెప్పబడ్డాయి. అంటే లోక వ్యవహారంలో కాని సామాజిక సేవలో కాని బాధ్యత తగ్గుతున్న కొద్దీ కర్మాచరణ కూడా అదేస్థాయిలో తగ్గిపోయింది. సత్వగుణానికి ఏడు రకాల కర్మలు తమోగుణానికి ఒకే రకమైన ర్మనిర్ణయించబడింది. జనాభాలో శూద్రులే అధికం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి సేవలందించటం శూద్రుల ప్రధాన కర్మ. సామాజిక సేవలో పెద్ద భాగస్వామి శూద్రుడే. గొప్ప శ్రమజీవి. గృహోపకరణాలైన కుండలు, బానలు, మూకుళ్ళు వగైరా మట్టిపాత్రలు చేసేది వారే. కంచు ఇత్తడి రాగి వెండి బంగారు వగైరా వస్తుసామగ్రి తయారు చేసేది వారే. చెరువులు బావులు తవ్వేది వారే. పంట పొలాలకి నీరు పెట్టడం, కోతలు కోసి ధాన్యాన్ని ఇల్లు చేర్చేది వారే. చెప్పులు కుట్టేది వారే. ఇలా ఎన్నో ప్రజాహిత సేవా కార్యాలకు శ్రమదానం ప్రధానం.


బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నలుగురు. పరస్పరం సహాయ సహకారాలతో పరస్పర అభ్యున్నతికి తోడ్పడుతూ ఒకనాటి వ్యవస్థ ఎంతో ఐక్యతతో మెలగినట్లు చరిత్ర చెబుతోంది. తను చేసుకున్న పురాకృత శుభాశుభ కర్మానుసారం సముచిత వర్ణంలో మనిషి జన్మించటం జరుగుతోంది. ఒకడు ఎక్కువ. ఒకడు తక్కువ అని భేదభావం లేదు. అందరికీ మోక్ష ద్వారాలు తెరిచే ఉంటాయి.


విదేశాల్లో కూడా నాలుగు వర్ణవిభాగాలున్నాయి. పాలకవర్గం, రక్షకవర్గం, వర్తకవర్గం, శ్రామికవర్గం. పాలకవర్గం మేధావివరంగా పిలువబడుతుంది. జనాభాలో శ్రామికవర్గం అధికశాతం కనుక ఒక్కోసారి పాలక రక్షక వర్గాల్ని అణగదొక్కి ప్రభుత్వాన్ని చేపడుతుంది. ఒక్కోసారి రక్షకవర్గం తక్కినవాటిని అణచివేసి పరిపాలనలోకి వస్తుంది. కొన్ని దేశాల్లో అధిపత్యం కోసం నిరంతరం యుద్ధానికి దిగుతున్నారు. రక్తపుటేరులు ప్రవహింపచేస్తున్నారు. అమాయక ప్రజలు దిక్కులేనివారైపోతున్నారు. కాని భారతదేశానికి ఈ వర్ణవ్యవస్థ ఒక వరం. ఇతర దేశాల్లోని దుస్థితి మనకు దాపురించలేదు. అయితే అలాంటి వ్యవస్థ ఈనాడు పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది.


ఒకనాడు మనుషులంతా ఒక్కటే. ఏ వర్ణ వ్యవస్థ లేదు. తనకు నచ్చిన కర్మలో నిమగ్నమయ్యేవారు. అది పదిమందికీ ఉపయోగపడుతూ వచ్చింది. ఆ కర్మను బట్టి వృత్తిని బట్టి కులం, కులాన్ని బట్టి వర్ణవ్యవస్థ ఏర్పడింది. అందులో మేధావివర్గం బ్రాహ్మణులుగా పిలువబడ్డారు. యదృచ్ఛా లాభ సంతుష్టో - దొరికిన దాంతో తృప్తిపడే జ్ఞానసంపన్నులు. వారిని గౌరవిస్తూ అందరూ పోషించే వాళ్ళు. బ్రాహ్మణ క్షత్రియ సహకారంతో అధికారం చెలాయిస్తూ పరిపాలన కోసం వర్ణవిభాగం ఏర్పరిచారని కొందరి విమర్శ. అయితే కులాన్ని బట్టి గుణ కర్మ స్వభావాలను బట్టి నాలుగు వర్ణాలను నేనే సృష్టించానన్నాడు (413) భగవానుడు. బ్రాహ్మణో ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః .... విరాట్ పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారని రుగ్వేదం, పురుషసూక్తం చెబుతున్నాయి. 


ఒకవర్గం అణగదొక్క బడిందని దాని అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టింది ఒకనాటి సమాజం. అది క్రమేణా రాజకీయ రంగు పులుముకొని రిజర్వేషన్స్ పేరిట కొనసాగుతోంది. ప్రతివ్యక్తి సామాజికంగా ఆర్థికంగా పురోగతి చెందాల్సిందే. అభివృద్ధి నిరోధం తగదు. అయితే ఏదో ఒకనాటికి ఏదో ఒక వర్ణం వెనుకబడటం తప్పదు. దానికోసం మళ్ళీ రిజర్వేషన్స్. అలా ఈ భూమి తిరుగుతున్న కాలం ఏదో వర్గం. రిజర్వేషన్కు అర్హత సంపాదిస్తూ ఉంటుంది. ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఒక్క భారతదేశంలో మాత్రం ఉండటం మహదాశ్చర్యం. అస్తు. , సత్వగుణం కలవాడు ఏ వర్గంలో ఉన్నా, వాడు బ్రాహ్మణుడే. తమోగుణం అధమాధమం. ఆ గుణం కలవాడు ఏ వర్గానికి చెందినా వాడు శూద్రుడే. సేవాభాగ్యం ఒక శూద్రుని పరిచర్యాత్మకం కర్మ శూద్రస్య - అని చెప్పబడింది. కాని నాలుగు వర్ణాలవారు సామాజిక సేవకులే. మాతా పితరులకు సేవ చేయాలి. విద్య వైద్య వ్యవసాయ వైజ్ఞానిక ఆర్థిక నైతిక రంగాల్లో ప్రతివ్యక్తి తనవంతు సేవ చేసి తరించాలి. సేవారంగంలో అందరూ సమానులే. ఇక్కడికి ఒక ప్రకరణం ముగిసింది. కర్మాచరణలో భగవత్ ఆరాధన, జ్ఞాననిష్ఠ, దానిఫలం గూర్చి దాదాపు పదకొండు శ్లోకాల్లో వివరిస్తున్నాడు భగవానుడు.


స్వే స్వే కర్మణ్యభారతః సంసిద్ధిం లభతే నరః | స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్చణు || 45


తమ తమ వర్ణాశ్రమాలకి చెందిన కర్మలో ఆసక్తి ఉన్న మనిషి సంసిద్ధిని పొందుతాడు. స్వీయకర్మలో తత్పరుడైనవాడు ఏవిధంగడా ఆ సిద్ధిని పొందుతాడో దాన్ని చెబుతా విను. ఇక్కడ నర శబ్దంలో ఒక విశేషం ఉంది. పశువులు పక్షులు తదితర జీవరాశులన్నీ భోగజీవులు. దేవతలు కూడా ఆ కోవలోని వారే. ఒక్క మనుషులు మాత్రం కర్మజీవులు. కర్మవల్ల బంధం కల్గుతుంది కదా. ఆ బంధంతో మళ్ళీ జన్మకర్మ చక్రగతిలో తిరుగాడాల్సి ఉంటుందని ప్రశ్న. ఇక్కడ కర్మ అంటే నిష్కామకర్మగా అన్వయించుకోవాలి. అపుడు కర్మతో బంధం కాదు. ముక్తి సాధించవచ్చు.


నిష్కామ కర్మాచరణలో చిత్తశుద్ది. చిత్తశుద్ధితో తత్వజ్ఞానం. ఆ జ్ఞానం ముక్తికి సోపానం. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు ఆచరిస్తే తమ తమ స్వాభావిక కర్మాచరణతో ఫలం స్వర్గం కాదు. సిద్ది అంటే ముక్తి లభిస్తుంది. ఈ శ్లోకంలో రెండు ముఖ్యాంశాలున్నాయి. వర్ణాశ్రమ ధర్మం పాటించడం ఒకటి. నిష్కామ కర్మాచరణ రెండోది. అంటే ఏ కర్మ చేసినా ప్రతిఫలం ఆశించరాదు. ఆ ఫలాన్ని భగవదర్పితం చేయాలి. వర్ణాశ్రమ ధర్మం గొప్పదని ఈ శ్లోకంలోని అంతరార్థం. ఎంతో కాలం నుంచి పూర్వుల నుంచి వస్తున్న ధర్మాన్ని పాటించిన వ్యాధుడు ధర్మవ్యాధుడనిపించుకున్నాడు. తులాధరుడు స్వాభావిక కర్మాచరణతో తరించాడు. హీనకులజులైన కొందరు ఆళ్వారులు అవధూతలు వర్ణాశ్రమ ధర్మాలు పాటించకపోయినా సిద్ధిని పొందారు. ఆదర్శంగా నిలిచారు. జ్ఞాన వైరాగ్యాది గుణాలతో కూడి పదిమందితో సాధువని సజ్జనుడని సదాచార తత్పరుడని కీర్తింపబడుతాడో వాడు తప్పక సిద్ధిని పొందుతాడు. పరగిన సత్య సంపన్నుడైనవాడు - పరనింద సేయతత్పరుడు కానివాడు - అరుదైన భూతదయానిధి యగువాడే - పరుల తాయని భావించువాడు - తగిలి వేంకటేశు దాసుడయినవాడు సంసిద్ధి పొందగలడని అన్నమాచార్యుల సంకీర్తన చెబుతోంది.


యతః ప్రవృత్తిర్బూతానాం యేన సర్వమిదం తతమ్ | స్వకర్మణా తమభ్యర్య సిద్ధిం విందతి మానవః || 46


సమస్త ప్రాణకోటి ఉత్పత్తి పరమాత్మ నుంచి ఏర్పడింది. ఈ కనిపించే నామ రూప జగత్తు ఆయన వల్లనే వ్యాపించింది. తన వర్ణాశ్రమ కర్మలతో ఆ పరమేశ్వరుని పూజించి మనిషి సిద్ది పొందుతున్నాడు. ప్రవృత్తి అన్న శబ్దానికి నడక ప్రవర్తన వ్యాపారం అనే అర్థాలున్నాయి. కాని ఇక్కడ సందర్భానుసారంగా వుత్పత్తి పుట్టుక అనే అర్థం తగింది. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే (10-8). నా వల్లనే ఈ జగత్తు నడుస్తోంది. మయా అధ్యక్షేణ ప్రకృతికి... నా అధ్యక్షతన ఈ ప్రకృతి చరాచర జగత్తు సృష్టింపబడుతోంది (9– 10) అన్నాడు భగవానుడు. -


పరమాత్మ వల్లనే వచ్చాం మనం. ఏ కోతి నుంచో చింపాంజీ నుంచో రాలేదు. అమృతస్య పుత్రాః - అమృతతుల్యులం మనం. మమైవాంశో జీవలోకే - సనాతనమైన జీవాత్మ నా అంశయే (15-7) అన్నాడు. పరమాత్మ నుంచి వచ్చాం మనం. మళ్ళీ పరమాత్మని చేరుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి కదా. అందుకు ఉపాయం ఇక్కడ కర్మమార్గం చెబుతున్నాడు. ఎలాంటి ప్రతిఫలం కోరకుండా నిష్కామంగా భగవత్ ఆజ్ఞగా ఫలాన్ని ఆ పరమాత్మకే సమర్పిస్తూ చేసే కర్మ మోక్షానికి దారి తీస్తుంది. అదే మన గమ్యం . -


యేన సర్వమిదం తతం - దేనితో ఈ సర్వజగత్తు వ్యాపించి ఉందో ఈ వాక్యం గీతలో మూడు చోట్ల వచ్చింది. రెండో అధ్యాయం 17వ శ్లోకం, ఎనిమిదో అధ్యాయం 22వ శ్లోకం, ఇప్పుడీ అధ్యాయంలో మొత్తం మూడు సార్లు. తొమ్మిదో అధ్యాయం నాలుగో శ్లోకంలో కొద్ది తేడాతో మయా తతమిదం సర్వయేన అని వుంది. యేన-కు బదులుగా మయా అన్న శబ్దం వాడబడింది. నాచేత ఈ జగత్తు అంతా వ్యాపించిందని అర్థం. సర్వ జగత్తుకు ఆధారభూతుడై అంతర్యామియై ఉన్న ఆ ఈశ్వరుని దర్శించలేనివారి గతి ఏమిటి? అని ప్రశ్న. పరమాత్మ అయిదుస్థానాల్లో వుంటాడట. 1.పరమపదంలో 2.పాలకడలిలో (వ్యూహరూపం) 3. విభవ రూపం 4. అంతర్యామి రూపం 5. అర్చా విగ్రహరూపంలో వెలసి ఉంటాడు. అర్చావతారాన్ని పూజింపడమే సాధకులు సామాన్యులు చేయాల్సిన పని. . పూజ అనేది ఒక పనిగా భావించరాదు. ప్రతి పని ప్రతి కర్మ పూజగా భావించాలి. ఆ ఆరాధన నిష్మామమై ఉండాలి. నాకు అది కావాలి ఇది కావాలి అని కామ్య భావనతో పూజ చేస్తే ఆ కర్మ బంధమైపోతుంది. పునరపి జననం పునరపి మరణం. సిద్ధిం విందతి అన్నాడంటే బంధరూపంగా కాకుండా మోక్షరూపంగా కర్మని మలచుకోవాలని భగవానుని సూచన. అందుకే కర్మలో భావన ప్రధానం. తులాభారంలో కృష్ణుని తూచటంలో అహంకారం ప్రదర్శించింది సత్యభామ. ఆ కర్మ బెడిసి కొట్టిందామెకు. రుక్మిణి ఉంచిన తులసి కాని కుచేలుడు సమర్పించిన ముక్కిపోయిన అటుకులు కాని ఒక్క రూపాయి విలువ చేయవు. వారి కర్మాచరణలోని భక్తి భావనకు వెల కట్టలేం. అలాంటి పవిత్ర భావనకి పరవశుడైపోతాడు పరమాత్మ. కర్తవ్యకర్మ భగవత్ సన్నిధికి చేరుస్తుంది. స్వకర్మలో తమభ్యర్చ్య అన్నది అందుకే. యేతుసర్వాణి కర్మాణి (12–6) తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ (12-7). ఈ రెండు శ్లోకాల భావమిది – కర్మలన్నీ నాకు సమర్పించండి. నా సగుణ రూపాన్ని అనన్య భక్తితో ఆరాధించండి. మీ మనస్సుల్ని నాలో లగ్నం చేయండి. మృత్యురూప సంసార సముద్రం నుండి వాళ్ళని శీఘ్రంగా ఉద్దరిస్తానని ప్రమాణం చేస్తున్నాడు భగవానుడు. బిడ్డ రక్షణ భారం తల్లితండ్రులు వహిస్తారు. అపార కరుణార్థ హృదయుడైన పరమాత్మ గరుడారూఢుడై వస్తాడు. మనల్ని తన సన్నిధికి చేర్చుకుంటాడు.


భగవద్గీత స్వధర్మాచరణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. అంటే ఆనాడు వర్ణాశ్రమ ధర్మాలు ఎంతో ఆదరింపబడ్డాయి. ఆనాటి వారి దృక్పథాన్ని ఈ నాటి దృష్టిలో డరాదు. విమర్శించరాదుతరతరాల నుంచి వస్తున్న స్వధర్మాచరణ ఉత్తమమని ఈ కింది శ్లోకం చెబుతోంది.


శ్రీ యాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుషితాత్ | స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || 47


బాగా ఆచరింపబడు పరధర్మం కంటె గుణరహితమైన స్వధర్మ ఆచరణమే గొప్పది. స్వభావ సిద్ధంగా ఏర్పరచిన కర్మలు చేస్తున్నవాడు పాపాన్ని పొందడు. . యుద్ధంలో రక్తపాతం ఉంటుంది. హింసాకాండకు అంతు ఉండదు అని తన క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టి సన్న్యాస ధర్మాన్ని స్వీకరిస్తానని అన్నాడు అర్జునుడు. కారణం బిచ్చమెత్తడంలో హింస ఉండదు. హాయిగా భిక్షాటనం చేసుకోవచ్చు. అది పరధర్మం. అథై ష్ఠమనుకున్నాడు అర్జునుడు. క్షత్రియ కర్తవ్య కర్మ స్వధర్మాచరణ ఎలాంటిదో అర్జునునికి తెల్పుతూ గీతోపదేశం ప్రారంభించాడు కృష్ణభగవానుడు. బంధుమిత్రులను చంపినా క్షత్రియునికి పాపం చుట్టుకోదు అని తేల్చాడు. ఈ శ్లోకం లాంటిదే మనకు మూడో అధ్యాయంలో వచ్చింది. దాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. .


శ్రీ యాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్| స్వధర్మే నిధనశ్రీ యః పరధర్మో భయావహః || (3-35)


పరధర్మంలో ఎన్నో సుగుణాలుండొచ్చు. అది లాభదాయకం కాదు. స్వధర్మంలో సుగుణాలు లేకపోవచ్చు. కాని బాగా ఆచరించే పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మం పాటిస్తూ చనిపోయినాశ్రీ యస్కరమే. పరధర్మాచరణం భయ కల్పితం.


మిథిలా నగరంలో ఒక బోయవాడు - వాడికి ఒక మాంసం కొట్టు ఉంది. పొట్టకూటి కోసం మాంసం అమ్ముకునేవాడు. అది నీచమైన కర్మ. కాని అది వాని కులవృత్తి. స్వధర్మం - కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా అన్నారు కదా.


కౌశికుడు ఒక బ్రాహ్మణుడు. తాపసి. మాంసం అమ్మేవాడికి దూరంలో నిల్చున్నాడు. మాంసం అమ్మేవానికి ఏ ధర్మం ఏ నీతి తెల్సు అనుకున్నాడు. ఆ బ్రాహ్మణుచూ సి ఆ వ్యాధుడు నమస్కరించాడు. నిన్ను ఒక బ్రాహ్మణ స్త్రీ పంపింది కదా అనటంతో ఆశ్చర్యపోయాడు. అయ్యా మాంసం అమ్మటం నా వృత్తి. అది చేయకపోతే నేను నా ధర్మాన్ని తప్పినవాడినౌతాను. నేను అసత్యమాడను. మాంసం తినను. కాని అమ్ముతాను. అమ్మ నాన్నలకు సేవలు చేస్తాను. మీలాంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తాను. శక్తిమేరకు దానం చేస్తాను. అలా అనేక విషయాలు చెప్పి ఆ బ్రాహ్మణునికి ధర్మోపదేశం చేసి ధర్మవ్యాధుడనిపించుకున్నాడు. కర్మమార్గంలో భగవత్ ఆరాధన, సామాజిక సేవ చేయడం సులభం. జ్ఞానమార్గంలో అలా చేయాలంటే కష్టతరం. ఇంద్రియ నిగ్రహం ఉండాలి.మనస్సును అదుపులో పెట్టుకోవాలి.సమదృష్టి ఉండాలి. అప్పుడే లోక సంగ్రహ కార్యాలు సాధ్యమవుతాయి. అయితే జ్ఞానమార్గంలో ఒక్కోసారి మనో బుద్ధీంద్రియాలు వశం తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కర్మయోగం స్వధర్మంగా, జ్ఞానయోగం పరధర్మంగా అన్వయించారు కొందరు వ్యాఖ్యాతలు.


గృహస్థాశ్రమంలోని ధర్మాలు వేరు. సన్యాస ఆశ్రమంలోని ధర్మాలు వేరు. గృహస్థునికి సంసార బాధ్యతలు ఎక్కువ. సన్యాసికి అవేవీ ఉండవు. అంతమాత్రాన గృహస్థ ధర్మం కన్నా సన్యాసధర్మం గొప్పదనుకోరాదు. అలాగే బ్రాహ్మణుని ధర్మం గొప్పదిగా, శూద్రుని ధర్మం మరోవిధంగా ఉండొచ్చు. శూద్రునికి బ్రాహ్మణ ధర్మం నచ్చవచ్చు. బ్రాహ్మణునికి వైశ్యుని ధర్మం నచ్చవచ్చు. కాని స్వధర్మం విడిచేసి పరధర్మం ఆశించటం అవలంబించటం దోషం. ప్రమాదకరం. ఒకడుకుక్కపిల్లని, గాడిదపిల్లని పెంచుతున్నాడు. రెండింటికి ఏ లోటూ లేకుండాడూ స్తున్నాడు. తీరిగ్గా కూర్చునపుడు యజమాని ముందు తోక ఆడిస్తూ గంతులు వేస్తూ ఉంటుంది కుక్కపిల్ల. ఒక్కోసారి అతని ఒడిలో చేరి అతని చేతులు నాకుతూ సంతోషపెడుతూ ఉంటుంది. దాని చేష్టలు గమనిస్తున్న గాడిదపిల్ల తను కూడా యజమానిని సంతోషపెట్టాలనుకుంది. ఓ రోజు యజమాని ముందుకెళ్ళింది. తోకాడించింది. అరిచింది. అటు ఇటు తిరిగి యజమాని ఒడిలో కాళ్ళు పెట్టి చేతిని నాకబోయింది. భయంతో దిగ్గున లేచాడుయజమాని. ఒక్క తోపు తోశాడు. పక్కనున్న దుడ్డుకర్రని అందుకున్నాడు. చావబాదాడు గాడిదపిల్లని. స్వధర్మాన్ని విడిచి పరధర్మం ఆశ్రయిస్తే ఇంతే సంగతులు.


ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు. త్రికాల సంధ్యావందనం చేసేవాడు. పొట్టకూటి కోసం కురు పాండవులకి గురువుగా స్థిరపడ్డాడు. అస్త్ర శస్త్ర విద్యలు నేర్పాడు. విద్య నేర్పటం ద్రోణుని స్వధర్మం. అది బ్రాహ్మణుని స్వధర్మంగా చెప్పవచ్చు. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టి యుద్ధం చేశాడుఅది క్షత్రియ ధర్మం. స్వధర్మం విడిచి పరధర్మం పాటించాడుయుద్ధరంగంలో ఊహించని రీతిలో చంపబడ్డాడు. స్వధర్మంలో చనిపోవటం మంచిది. పరధర్మంలో చావటం భయావహంఇలా ఎన్నో ఉదాహరణలు ఇవ్వొచ్చు. అయితే తల్లితండ్రులకు సేవలు చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అహింస సత్యం ధర్మం క్షమ ఇత్యాదులన్నీ అందరికీ ఆచరణీయధర్మాలే. అసత్యం దొంగతనం వ్యభిచారం మద్యపానజూ దం ఇత్యాదులన్నీ అందరికీ నిషిద్ధ కర్మలు. పరధర్మాలు. డాక్టరు కత్తిపెట్టి కోస్తాడుదుష్టాంగాన్ని నిర్మూలిస్తాడు. రోగి ప్రాణాన్ని కాపాడుతాడు. ఆ హింస వల్ల డాక్టరుకు పాపం రాదు.


కౌరవులు ఆతతాయిలు అన్నాడు అర్జునుడు (1-36). ఆతతాయిలు ఆరు రకాలు వాళ్ళు.


1.విషం పెట్టువాడు


2.ఇంటికి నిప్పుపెట్టువాడు


3.మారణాయుధాలతో దాడి చేసేవాడు


4.పరధన


5.ఇతరుల స్థలం (రాజ్యం) ఆక్రమించేవాడు.


6.పరభార్యలను చెరిచేవాడు లేదా అవమానించేవాడు.


ఈ ఆరు లక్షణాలున్న కౌరవుల్ని చంపితే పాపం రాదు. అది క్షత్రియుని స్వధర్మం. చంపకపోవటం పరధర్మం.


పరిపూర్ణ తత్వజ్ఞాని కాకపూర్వం జనకుడు తన ఆత్మీయుల్ని కోల్పోయాడు. ఆ దుఃఖంలో ఇల్లు వదిలిపెట్టి అడవులకెళ్ళి సన్యాసం తీసుకోదలచాడు. అపుడు అశ్మకుడు అనే బ్రాహ్మణుడు జనకుని వద్దకు వచ్చాడు. అతను విషయం తెలుసుకున్నాడు. రాజా ఈ శరీరమే అప్పుగా తెచ్చుకున్నాం. ఈ సంసార చక్రబంధంలో ఎవరికి ఎవరు? మనమే శాశ్వతం కాదు. ఇక బంధువుల కోసం బాధ పడటమా. రాజ్యపాలన స్వధర్మం నీకు. పరధర్మమైన సన్యాసం కాదని హితం చెప్పినట్లు మనకు భారతం శాంతి పర్వంలో వస్తుంది.


సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ | సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః || 48


అర్జునా దోషంతో కూడిన స్వధర్మాన్ని త్యజించరాదు. ఎందుకంటే పొగతో కప్పబడ్డ నిప్పులా కర్మలన్నీ ఏదో ఒక దోషం కల్గి ఉంటాయి.


సహజం కర్మ. స్వభావజ కర్మ స్వకర్మ నియత కర్మ ఇవన్నీ పర్యాయ పదాలు. అన్నింటికీ అర్థం ఒకటే. స్వభావసిద్ధమైన స్వధర్మ కర్మ అని అర్థం. ఎవరికి స్వభావ సిద్ధమైందని ప్రశ్న. బ్రాహ్మణులకి యజ్ఞయాగాదులు చేయటం, వేదాధ్యయనం, అధ్యాపనం. క్షత్రియులకి ధర్మరక్షణ ప్రజాపాలనం. వైశ్యులకు గోరక్షణ, వ్యవసాయ వ్యాపారాదులు. శూద్రులకు సేవాధర్మం. ఇవన్నీ ఆయా వర్ణాల వారికి సహజ సిద్ధమైన కర్మలు. వారి వారి కర్మాచరణలో దోషం ఉన్నా కూడా ఆ కర్మల్ని విడిచిపెట్టరాదు. అయితే కర్మలు చేస్తే బంధం కదా. పాపం వస్తుంది కదా అని భయపడాల్సిన పనిలేదు. శాస్త్రవిహిత కర్మాచరణ వల్ల ఏ దోషం ఉండదు. ఏ పాపమూ రాదు (3-8). జనకాది జ్ఞానులు ప్రతిఫలాపేక్ష లేకుండా లోకహితార్థం కర్మలాచరించారు. పరమ సిద్ధిని పొందారు (3-20). గమనించాల్సింది ఏమిటంటే ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉంటుంది. నిప్పు ఉన్న చోట పొగ ఉంటుంది కదా. సత్వ రజస్తమో గుణ యుక్తమైన కర్మల్లో దోషం తప్పక ఉంటుంది.


                                                                                 (సశేషం)