ఋణత్రయ విముక్తి ఋషి పంచమి


ఋణత్రయ విముక్తి ఋషి పంచమి


- డా|| కె.బి. రాజేంద్రప్రసాద్


భారతీయ ధర్మం మహోన్నతమైంది. పరిపూర్ణ మానవీయతతో నిండి అలరారుతుంది. ధర్మాని రక్షిస్తే, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని విశ్వసించే సమాజం భారతీయ సమాజం. ధర్మం అంటే ధరించేది. ఆచరించేది ఆచారం. ధర్మానికి ధైర్యం ఎక్కువ. ఆచారానికి ఆత్మబలం ఎక్కువ. ధర్మగ్లానిని ధరణి భరించలేదు. ఆచార హీనతను ఆర్యులు అనగా జ్ఞానులైన మాన్యులు సహించలేరు. నిజానికి ఆచరణలో ఆత్మబలాన్ని, ఆధ్యాత్మిక ఫలాన్ని, సమయోగ జీవన సాఫల్యాన్ని సాధించే సదాచారమే ధర్మం.


శ్లో || ఆచారః పరమోధర్మ: ఆచారః పరమం తపః | ఆచారాత్ వర్ధతే హ్యాయః ఆచారాతాప సంక్షయః || అంటోంది కాశీపురాణం. ఆచారమే పరమధర్మం. ఆచారమే గొప్పతనం. ఆచారం వలననే ఆయువు వృద్ది, పాపక్షయం కలుగుతాయి. "సదాచారమ్ ధర్మమూలమ్". సదాచారమే ధర్మానికి మూలమని పండితుల హితవు.


జీవకోటిలో మానవుడు సమున్నతుడు. సుకృతుడు. బుద్ధి, వివేకం, సంస్కారం కలిగినవాడు. మంచిమాట, మధురమైన ఆలోచనలు, మహితమైన మేధా సంపదను కల్గి యున్నాడు. మనువు నుండి సంక్రమించిన మానవీయత కూడా కత్తి యున్నాడు. కనుక చేతలలో, వ్రాతలలో, ఆలోచనలలో, అవలోకనములలో, సహకారంలో, ఉపకారంలో, ఆచారాలలో, ఉపచారాలలో సహజీవన సౌందర్య మాధుర్యాన్ని ఆస్వాదించాలని, అందించాలని, ఫలితంగా ఆనందానుభూతిని పంచాలని, పెంచాలని భావిస్తాడు మానవుడు. ప్రకృతితో సహజీవనం చేస్తాడు. ప్రకృతిని ఆరాధిస్తాడు. అర్చన చేస్తాడు. సహజీవులతో నేస్తం కడతాడు. మైత్రిని పంచుతాడు. బ్రతుకు దాదాపిన పెద్దలను, గురువులను, మహర్షులను గౌరవించి పూజిస్తాడు. జన్మ కారకులైన పితరులపై భక్తిని ప్రకటిస్తాడు. అయితే ఈ అన్నింటికిని నిర్దిష్టమైన, నిర్దుష్టమైన సంప్రదాయ మార్గాలను, ఆచార విధానాలను అలవరించుకుని ముందుకు సాగుతాడు. మంచిని పంచాలి. వంచనను త్రుంచాలి. దీపాలు వెలిగించాలి. పాపాలను పరిహరించాలి. తాపాలను తీర్చాలి. కోపాలను శాపాలను తిరస్కరించగల శక్తి సామర్థ్యాలు సొంతం కావాలి. అందుకు ఆచారం మూలంగా గల ధర్మాన్ని అనుసరించాలి. ధర్మంతోనే సంసార సాగరమును దాటగలం.


ఈ లోకానికి ఒంటరిగా వస్తున్న మానవుడు జతలు కట్టి, సమాజాలను ఏర్పాటు చేసి, సమైక్య జీవన సౌందర్యానుభూతిని పొంది, చివరకు అంత్యంలో తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోతున్నాడు. కాని ఒక ధర్మం మాత్రం అతడికి తోడుగా, నీడగా పరలోకంలో కూడా పలుకరించడం విశేషం. ఇదే మనకు మహాభారతం తెల్పిన నీతి.


| భారతీయులకున్న ధార్మిక వ్యవస్థ చాలా బలమైంది. బ్రహ్మచర్యం, సారస్యం, వానప్రస్థం, సన్యాసం అంటూ చతుర్విధ ఆశ్రమాలు అందు పాటించవలసిన సదాచార సంపత్తిని చక్కగా వివరించారు. ఈ అన్నింటిలోను గారస్య ధర్మం చూడగట్టాలిపరమోత్కృష్టంగా సెలవిచ్చారు. గృహస్తుడు తన ధర్మాచరణతో ఋణవిముక్తిని, కైవల్య ముక్తిని సాధించుకొంటాడన్నారు. వేద పఠన పాఠనాదుల ద్వారా బ్రహ్మ యజ్ఞం, తర్పణల ద్వారా పితృయజ్ఞం, క్రతు హోమాల ద్వారా దైవయజ్ఞం, బలియన్నం ద్వారా భూతయజ్ఞం, అతిథి అభ్యాగతుల నాదరిస్తూ మానషయజ్ఞం ఇలా పంచ మహాయజ్ఞాలను నిర్వహించే అవకాశం, అదృష్టం కలుగుతుందన్నారు. ఈ క్రమంలోనే త్రివిధ ఋణాలను కూడా సూచించారు. అవే 1. దేవ ఋణం 2. ఋషి ఋణం 3. పితౄణం. వీనిని విధిగా తీర్చుకోవాలని సెలవిచ్చారు. మానవ జన్మ తరించడానికి, మానవకృత కర్మలు ఫలించడానికి, మనుగడ మహిమోన్నతమై ఋణం నిశ్శేషమైతే కైవల్యముక్తి జీవునకు సొంతమవుతుందని విశ్వాసం.


1. దేవ ఋణం: దేవ ఋణం భగవంతునకు ప్రతి జీవి ఋణపడి యుంటుంది. ఎలా అంటే ఈ ప్రకృతి - ప్రకృతి జీవులు పంచభూతాత్మకమై అలరారుతున్నాయి. అవి నేల, నింగి, నీరు, గాలి, అగ్ని. వీనితోనే జీవులు సదా సహజీవనం చేస్తారు. ఇవి లేని బ్రతుకును ఊహించలేము. వానికి కారణం పరమాత్మ. సర్వాంతర్యామియైన భగవానుడు విశ్వ యస్సునకు వాటిని మనకందించాడు. కనుక సర్వోపగతుడైన పరమాత్మను నేలగ, నింగిర, నీరుగ, గాలిగ, అగ్నిగ భావించి ఆరాధించాలి. ఆత్మార్పణ గావించుకోవాలి. అయితే భార్య, బిడ్డలు, సంపద, అనే ఈషణ త్రయం మానవ మనస్సును తప్పుదారి పట్టిస్తాయి. కనుక బుద్ధిని మనస్సుతో కట్టివేయాలి. ప్రకృతిలో పరమాత్మను చూడగట్టాలి. మన ఆరాధనలతో, అర్చనలతో, హోమాలతో ఆ దైవ ఋణం తీర్చుకోవాలి.. జనక మహారాజు రాజర్షి. మిథిలా నగరంలో నిరంతరం యజ్ఞాలు, పుణ్యహోమాలు, వేదనాదాలు, మంత్రస్వరాలు విన్పించేటట్లు చేశాడు. ఆరాధనలు, అర్చనలు, హారతులు, ఆధ్యాత్మిక విభూతిని పంచాడు. మనకు ఒక దివ్యస్ఫూర్తిగా నిలిచాడు.


2. ఋషి ఋణం: ఋషులను పూజించడం ద్వారా ఋషి ఋణం తీరుతుంది. ఋతము వైపు పయనించువాడు ఋషి. ఋతము అనగా పరమ సత్య జ్ఞానం. ఇహపరాలకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కలిగి, పరమాత్మను దర్శించిన ద్రష్ట ఋషి. క్రాంతదర్శి. వేదాలు, వేదమంత్రాలు, వాని అర్థాలు, జన్మకర్మల రహస్యాలను తెలిసి, మానవ సమాజాలకు అందించినవారు ఋషులు. వీరు ఎంతోమంది యున్నను, సప్తర్షులని మనం ఏడుగురిని చెప్పుకుంటున్నాం. వారే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్టుడు, జమదగ్ని. నక్షత్ర మండలంలో వీరు దర్శనమిస్తూనే ఉన్నారు. ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు. వేద వేదాంత శాస్త్ర రహస్యాలను శోధించి, సాధించినవారు. తపోనిధులు. మంత్రశక్తి సమన్వితులు. వీరు రచనలు చేశారు. భాష్యాలు వ్రాశారు. ధర్మనీతి, నిరతిని, నియతితో అనుభూతితో అందించారు. వారు బ్రతికింది. సమాజం కోసం. నడిచింది మానవ సంఘాల కోసం. వారు క్రతువులు చేసినా, కర్మలను చేసినా, తపాలు చేసినా, జపాలు చేసినా విశ్వకళ్యాణమే పరమావధిగా సాగారు. ధర్మాన్ని, దైవతత్త్వాన్ని, ఆత్మ నిత్యత్వాన్ని, సత్యశీలాన్ని సాహిత్యం ద్వారా సమాజానికి అందించారు. అలాంటి మహర్షులే మూలపురుషులై, గురువులైనారని భావించి మానవులు కశ్యప గోత్రం, భరద్వాజ గోత్రం ఇత్యాదిగా గోత్రనామాలలో తరాలు మారినా తలచుకొంటూనే ఉన్నారు. కనుక ఆ మహరులను మనం పూజించి, స్మరించి ఋణం తీర్చుకొంటున్నాం. అదే భాద్రపద శుద్ధ పంచమి "ఋషిపంచమి" పర్వదినం.


| వేదాలు అపౌరుషేయాలు. అంటే మానవ మాత్రులు వ్రాసినవి కావు. చతుర్ముఖ బ్రహ్మ నుండి వెలువడిన వేదమంత్ర రాశిని దర్శించిన వ్యాసభగవానులు వానిని ఋక్, యజుర్, సామ, అధర్వణములుగా విభజించాడు. కనుక ఆయన వేదవ్యాసుడైనాడు. అయితే ద్రష్టలైన మహర్షులు వానినిగ్రహించి, అవగాహన చేసుకొని వ్యాఖ్యానాలు, భాష్యాలు, ప్రసంగాలు, పాఠాల ద్వారా సమాజానికి అందించారు.


మన ధర్మం, మానవ ధర్మం వేదమూలంగా ఏర్పడింది. మన సంస్కృతి వైదిక సంస్కృతి. మన ఆచార జీవన విధానం వైదికాచార యుక్తమైంది. మరి ఇంతటి విలువైన, మేలైన, జ్ఞానాన్ని అందించిన మహర్షులకు అంజలి ఘటించాలి కదా! ఆరాధనార్చనలతో వారి ఋణం తీర్చుకోవాలి. అదే ఋషిపంచమి పర్వదినం.


3. పితౄణం ఋణం  కని పెంచి, విద్యాబుద్ధులు నేర్పించిన తల్లితండ్రుల ఋణం తీర్చుకోవడం. వారు మనకు జన్మనిచ్చినట్లే, మనం కూడా సత్సంతానం పొంది, వంశాభివృద్దికి చేయూత నివ్వడం,వృద్దాప్యంలో తల్లితండ్రులను సేవించి, భజించి, పూజించి, వారిని తరింపచేయడం.వారి మరణానంతరం విధిగా తర్పణలను అందివ్వడం. పితృకార్యాలనుశ్రద్దాభక్తులతో నిర్వహించడం.ఇలాపితృణాన్ని మానవుడు తీర్చుకొనాలి.. ఈ త్రివిధ ఋణాలు తీర్చుకొన్న మానవుడు ధన్యుడు. చరితార్థుడు. ఇక ఋషి పంచమి. భాద్రపద శుక్ల పంచమిని పెద్దలు ఋషిపంచమి పేరుతో పర్వదినంగా, వ్రతంగా సెలవిచ్చారు. మహర్షులను పూజించే పంచమి ఋషి పంచమి. రజస్వల సమయంలో తెలిసో తెలియకో కన్యలు లేదా స్త్రీలు చేసిన అపచారాలకు ప్రతిగా వచ్చిన పాప నిర్మూలనకు ఋషి పంచమీ వ్రతాన్ని పెద్దలు సూచిస్తున్నారు. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించినందులకు కల్గిన పాపాన్ని నాల్గు భాగాలు చేసి స్త్రీల రజస్సులోను, చెట్ల జిగురులోను, నీటి నురుగులోను, భూమి లోపల నిక్షిప్తం చేశాడట. కనుక స్త్రీలు ఆ రజస్వల సమయంలో అంటకూడని వారిని తాకి పాపం తెచ్చుకుంటే ఈ ఋషిపంచమి వ్రతపుణ్యంతో పరిసమాప్తి అవుతుందని విజ్ఞుల సలహా. అందుకే "మమ ఋతు సంపర్క జనిత దోష పరిహారార్థం.


ఓం అదితి సహిత కశ్యపాయనమః అనసూయా సహిత అత్రయే నమః సుశీలా సహిత భరద్వాజాయనమః కుముద్వతీ సహిత విశ్వామిత్రాయ నమః అహల్యా సహిత గౌతమాయనమః రేణుకా సహిత జమదగ్నయే నమః అరుంధతీ సహిత వసిష్ణాయనమః ఓం సప్త ఋషిభ్యో నమః


అంటూ నమస్కరించి "ఋషి పూజనం కరిష్యే" అని సంకల్పం చెప్పుకొని పూజను చేయాలి. వ్రతకథను విధిగా చెప్పించుకొని వినాలి. అయితే మనలో మనకే ఎన్నో అనుమానాలు. నిజమా? పాపాలు తొలగుతాయా? అని. వ్రతాలకు నోములకు విశ్వాసం మూలం. భక్తి ఆలంబనం. అయితే మానవ జీవన మార్గానికి దశను, దిశను నిర్దేశించిన మహర్షులను స్మరించడం కనీస బాధ్యత. అమ్మ, నాన్న, గురువు, దైవం ఇలా మనం ఒక తత్త్వ మార్గంలో పయనించడానికి, పెద్దలను గౌరవించి, పూజించడానికి మూల పురుషులు ఆ మహాజ్ఞానులే. ఇది నిజం. ఇది ఋజువు. కనుక ఋణత్రయాన్ని నిశ్శేషం చేసుకొంటూ, మహర్షులకు అంజలి ఘటించి, పరమాత్మ దివ్య మార్గం వైపు పయనిద్దాం.