వినాయకుని గురించిన విశేషాలు


 బదరీనాథ్ వద్ద వినాయకుని గుహలు ఉన్నాయి. ఆ గుహలో వ్యాసమహర్షి భారతం చెప్తూంటే, ఘంటాన్ని ఆపకుండా గణపతి భారతం రాశాడట. కేదార్ నాథ్ యాత్ర చేసే యాత్రికులు వారి మార్గంలో ఉండే గౌరీకుండ్ వద్ద బాలగణేశుని ఆలయాన్ని దర్శిస్తారు. శ్రీ శైలంలో సాక్షిగణపతినిచూడనిదే యాత్ర పూర్తికాదని చెప్తారు. శబరిమలలో కన్నెమూల గణపతి ప్రసిద్ది చెందింది. మధురలో క్షిప్రగణపతిని ప్రతిభక్తుడు దర్శించి పూజిస్తాడు. చవితి తిథి వినాయకునికి ఎంత తికరమయినది. ఆ తిథి నాడు గణపతి పుట్టుక జరిగింది. వినాయకుని ఆకారం చూడటానికి ఎంతో విచిత్రంగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద చెవులు, పెద్ద ఉదరము, చిన్న చిన్న కన్నులు, ఏనుగుతల, రెండు దంతాలలో ఒకటి పూర్తిగా ఉంటుంది. మరొకటి విరిగి ఉంటుంది. గణపతి తన దంతాలలో ఒకదాన్ని విరిచి, భారతం రాయటానికి దాన్ని ఘంటంగా ఉపయోగించాడట.


విద్యను, జ్ఞానాన్ని, మేధస్సును ప్రసాదించే విద్యా దైవంగాను, నాట్యగణపతిగానూ,ఇలాగే అనేకరూపాలతో, అనేకనామాలతో భక్తులకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన రూపాన్ని విచిత్రంగా భావిస్తారు కానీ ఆయన తన రూపం ద్వారా ఎన్నెన్నో విషయాలను బోధిస్తున్నాడు. వినాయకుడికి అమర్చిన ఏనుగు తలలో తొండం ఎంత బరువైనా మోయగలదు. అంతేకాదు, ఎంతటి కష్టసాధ్యమైన పనయినా సాధించగలదు. తన తొండంతో నేలమీద పడిన ఎంత చిన్న వస్తువునైనా తీయగలదు. గణేశుని శిరస్సు విఘ్నాలను తొలగించి, వారికి శుభాన్ని కలిగిస్తుంది. తొండము ఆత్మవిశ్వాసానికి, ఆత్మాభిమానానికి సంకేతం. కన్నులు చిన్నవిగా ఉన్నప్పటికీ సూక్ష్మదృష్టి అధికం. పెద్ద చెవులు అన్ని విషయాలనూ వినాలని, మంచి విషయాలు ఆకళింపు చేసుకోవాలని బోధిస్తాయి. దంతాలు పరులకు హాని తలపెట్టకూడదన్న సందేశాన్ని తెలుపుతాయి. చిన్ననోరు మితంగా మాట్లాడాలనీ, అప్రియ భాషణ చేయకూడదనీ ఉపదేశిస్తుంది. గణపతికి ఉండే నాలుగు హస్తాలు ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు సంకేతాలు. వాటిని పాటించాలన్న భావాన్ని చెప్తాయి. ఏకదంతం చెడును తొలగించి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని సూచిస్తుంది. పెద్ద ఉదరం అన్నిటినీ ప్రశాంతంగా జీర్ణించుకోవాలనీ, ఇతరులు నమ్మి చెప్పిన రహస్యాలను బొజ్జలోనే నిక్షిప్తం చేయాలన్న సలహా ఇస్తుంది.


గణపతి చేతిలోని గొడ్డలి బంధాలు తెంచుకునే సాధనం. ఆయన చేతిలో పట్టుకున్న చెరుకుగడద్వారా చెరుకుగడనునమిలి పిప్పిన ఉమ్మేసినట్లుగా మంచిని హృదయంలోకి తీసుకుని, చెడు తలంపులను, దుర్మార్గపు చర్యలను విసర్జించాలని తెలుపుతోంది. మోదకప్రియుడైన విఘ్నేశ్వరుడు మోదకం అంటే, తాను కష్టపడి శ్రమించి సాధించిన దానికి తగిన బహుమతిగా భావించాలని బోధిస్తున్నాడు. గణపతి ఎలుకను వాహనంగా ఎంచుకోవడంలో ఒక అంతరార్థం ఉంది. అల్పజీవులను నిర్లక్ష్యం చేయకూడదనీ, కోరికలను, అహాన్నీ అదుపులో ఉంచుకోవాలని, తిమిరాన్ని తొలగించాలనీ, దర్పాన్ని అణచివేయాలన్న భావనను ప్రకటిస్తుంది. | | విఘ్నేశ్వరుడు తర్పణ ప్రియుడు. గణపతికి 21 రోజులు బెల్లం పానకంతో తర్పణ చేస్తే తాము అనుకున్న పనులు ఎటువంటి విఘ్నము అవాంతరాలు లేకుండా సాధించగలుగుతారు. ఈ స్వామికి ఉండ్రాళ్ళు, అరటిపళ్ళు, పేలాలు, అటుకులు, బెల్లం, వడపప్పు, పానకం ఎంతో ప్రీ తికరమైనవి. జిల్లేడుపూలతో గణపతిని పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయి. వినాయకచవితినాడు వినాయకునికి ఇష్టమైన సంఖ్య 21 అయినందున 21 పత్రాలతో ఆయనను పూజిస్తారు. ఆ పత్రాలలో గరికకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్నాయి. వినాయక చవితినాడు మాత్రమే తులసీదళాలతో వినాయకుడిని పూజిస్తారు. మరి ఏ ఇతర రోజుల్లోనూ వినాయకుని తులసీదళాలతో పూజించకూడదు. అలా పూజించక పోవటానికి వెనక ఒక కథ ఉన్నట్లుగా తెలుస్తోంది.


వినాయకుడు తపమాచరిస్తున్న సమయంలో తులసి ఆయన పట్ల మరులుకొని, ఆయన తపాన్ని భంగం చేసింది. తనను వివాహం చేసుకోమని కోరింది. ఆమె కోరికను నిరాకరించినప్పటికీ, ఆమె తన కోరికను, పట్టుదలను విడువక పోవడంతో ఆగ్రహం చెందిన గణేశుడు ఆమె రాక్షసుని భర్తగా పొందుతుందని, వృక్షరూపం పొందుతుందనీ శపిస్తాడు. ఆమె తన తప్పును తెలుసుకుని ఆయనను ప్రాధేయపడింది. ఆప్పుడాయన ఆమెను కనికరించి ఆమె విష్ణుమూర్తికి ప్రియమైనదవుతుందని, ఆమె చెట్టు రూపంగా మారినా తులసి పేరుతో పూజింపబడుతుందనీ, ఆ దళాలు మాలగా కూర్చబడి విష్ణుమూర్తి కంఠానికి అలంకారంగా మారుతుందని, తులసీదళాలు పరమ పవిత్రంగా భావింపబడుతాయనీ, భగవంతుని తులసీదళాలతో పూజిస్తేప్రీతి చెంది, భక్తులను అనుగ్రహిస్తాడని చెప్పి గణపతి తులసికి ఆనందాన్ని కలిగించాడు.


గణపతికి గరిక అతీట తికరమయినది. గరికతో ఆయనను పూజిస్తే ఆ స్వామి భక్తుల పట్ల తన కృపావీక్షణాలను ప్రసరింప చేస్తాడు. ఏ నోములు, వ్రతాలు, పూజలు చేసినా హరిద్రాగణపతికే మొదటిపూజ. హరిద్రాగణపతికి ప్రథమపూజ జరిపించటానికి వెనుక ఒక కారణం ఉన్నట్లుగా తెలుస్తోంది.


పూర్వం త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులు పర్వత రూపాలుగా ఉన్నారు. అయితే, ఆరాక్షసులను ముగ్గురినీ సంహరించాలంటే, ఒకేసారి ఆ మూడు పురాలను కూల్చివేయాలి. అలా చేయటానికి ఆ పురాలు మూడు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ మూడింటినీ ఒకే వరుసలో నిలబెట్టాడు. మూడు పర్వతాలు ఒకేచోట ఉండడంతో శివుడు నారాయణాస్త్రాన్ని ఉపయోగించి ఆ ముగ్గురు రాక్షసులనూ వధించాడు. కాని దురదృష్టవశాత్తు నంది మూడోకొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగి పోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతనికి అప్పగించాడు. అందుకు పరమశివుడు సంతోషించి ప్రతి ఇంట ఈ పసుపుకొమ్మును దంచి ఆ పొడిని శుభకార్యాలలో వాడాలని, పసుపు శుభప్రదమని, సౌభాగ్యకరమని చెప్పాడు. ఆ పసుపు పొడితో తయారు చేసిన హరిద్రా గణపతికి ప్రథమ పూజ జరపాలని ఆదేశించాడు.


వినాయక చవితినాడు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించడం ఎంతోశ్రేష్టం. వెండితో చేసిన గణపతిని పూజిస్తే వారు తలపెట్టిన కార్యం పూర్తవుతుంది. మంగళవారం నాడు చవితి తిథి, హస్తానక్షత్రం ఉంటే ఆ రోజు గరికతో, జిల్లేడు పూలతో వినాయకుని పూజిస్తే వారికి సమస్త లాభాలు చేకూరుతాయి. వినాయకునికి సిద్ధి, బుద్ది అనే ఇద్దరు పత్నులు ఉన్నారని, బ్రహ్మ వారిద్దరినీ గణపతికి ప్రసాదించాడనీ పురాణ కథనం. క్షీర సాగర మథనం జరపటానికి ముందుగా సురులు, అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. అందువల్ల వారి పనికి విఘ్నం ఏర్పడటంతో విష్ణుమూర్తి వారికి సాయపడ్డాడు. ఆ పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవిని వినాయకుడు తీసుకెళ్ళిపోతాడు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు గణపతితో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పత్నిగా నిర్ణయించబడిందని చెప్పారు. వినాయకుడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించి, లక్ష్మీదేవి అంశతో భార్య కావాలని కోరాడు. బ్రహ్మ సిద్దిలక్ష్మి, బుద్దిలక్ష్మి అనే ఇరువురు కన్యలను సృష్టించి గణపతికి ఇచ్చాడు. అప్పటినుంచి వినాయకుడు లక్ష్మీగణపతి అయ్యాడు. గజాననుడు, లంబోదరుడు, విఘ్ననాయకుడు, ఏకదంతుడు, నాట్యగణపతి, వినాయకుడు, మూషికవాహనుడు, గణనాయకుడు, ఉమాసుతుడు, విఘ్నేశ్వరుడు మొదలైన ఎన్నో పేర్లతో ఆయన పూజింపబడుతున్నాడు. జ్ఞానాన్నీ, విద్యనూ ప్రసాదించే దైవం వినాయకుడు. ఆయన ముందు గుంజీళ్ళు తీసినవారు ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు.