భగవంతుని అనుభూతి

భగవంతుని అనుభూతి భగవంతుని అనుభూతి ఎలా పొందటం? ఎలా ఉంటుంది? మనం ఈ భూమిపై జీవించి ఉండు కాలములో ఆయన అనుభూతిని పొందగలమా? ఆయన అనుభూతి కోసం కోట్ల సంవత్సరాల నుండి మానవులు తపస్సులు, యజ్ఞ యాగాదులు కావించుచున్నారు. వీరందరూ భగవంతుని తనివితీరా అనుభవించినవారే. కాని ఆ అనుభూతిని ఏవిధంగా అనుభవించాలి? అందరమూ ఆయన అనుభూతిని పొందాలనే కోరిక ఉన్నవారమే. భగవంతుడు అదృశ్యుడు, అవ్యక్తుడు. ముట్టుకోలేము, పట్టుకోలేము అంటుంటారు. కాని ఆయన అనుభూతిని మాత్రం తప్పక పొందగలము. సాధన చేస్తే మనం కోరే విధంగా అనుభూతిని పొందగలము. ఆయన అందనివాడు కాదు. సాధన చేస్తే కనబడనివాడు కాదు. భగవంతుని అనుభూతి పొందటానికి కావలసిన మొదటి సాధనం విశ్వాసం, సంపూర్ణభక్తి, శరణాగతి, ప్రపత్తి వీటిద్వారా భగవంతుని సులభంగా గుర్తించవచ్చు. అసలు మననుండి ఆయన దాగుండలేడు. గాలి కనబడకపోయిన దాని అనుభూతి ద్వారా మనం అది ఉన్నదని ఎట్లా గుర్తించగలమో, భగవంతుణ్ణి కూడా భక్తుడు అలాగే గుర్తించగలడు. ఆయన సర్వాంతర్యామి. ఇందుగలడందులేడని సందేహము లేదు. ఎందెందు వెదికినా అందందే కలడు. కాని మనము ఆయనను చూచే స్థాయికి ఎదగాలి. నమ్మినవారికి అంతరంగము లోను, నమ్మనివారికి అందనంత దూరములోను ఉంటాడు ఆ పరమాత్మ. భక్తిభావనతో ఆరాధించే వారికి సులువుగా, అవలీలగా పట్టుబడతాడని ఎందరో భాగవతోత్తములు భావించారు. కాని భక్తి, విశ్వాసములు లేక ఎన్ని శాస్త్రాలు, ఉపనిషత్తులు చదివినా లాభం ఉండదు. అందుకే పురాణ పఠనం కంటే కూడా గోవిందుని భజించుమని, అది మన జీవిత సాఫల్యము పొందుటకు ఉపయోగపడగలదని ఆదిగురువు శంకరాచార్యులు సూచించి, భజగోవిందాన్ని మనకందించారు. ఇంతకు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను మనము ఎలా చూడాలి? ఎలా అనుభూతి పొందాలి? అనే ప్రశ్నకు సాక్షాతశ్రీ కృష్ణుడే సమాధానం చెప్పాడు. పాండవులంటే శ్రీ కృష్ణునికి ఎంతé మ. అలాంటివారిని ద్యూత్రీడ సమయాన ఎందుకు ఆదుకోలేదనే ఉద్దవుని ప్రశ్నకు జవాబుగా కృష్ణుడిలా చెప్పాడు. "నేను సర్వాంతర్యామినని ధర్మరాజుకి తెలిసినప్పటికీ, ఆ సమయాన నేను అక్కడ లేనని, ఆ ద్యూత్రీ డ తన స్వశక్తితో గెలవాలని, పైగా నేను అక్కడికి రాకూడదని ఆయన కోరుకున్నాడని అందుకే ఓటమిపాలై కష్టాలను కొని తెచ్చుకున్నాడని చెప్పాడు. మరియు భగవంతుడు ఎప్పడు మన సమీపముననే ఉన్నాడని భావించాలని కూడా చెప్పాడు. మనం చేసే ప్రతి పనిని, ప్రతి మాటని, ప్రతి చేష్టని మనకంటే ఎక్కువగా గమనించుచున్నాడన్నది పచ్చినిజం. మనం సర్వదా భగవంతుని సన్నిధిలోనే ఉన్నామన్న సత్యమును గ్రహించి, ఆయన మన ప్రక్కనే ఉండి మనం చేయుచున్న ప్రతి కర్మను చూస్తున్నట్లు అనుభూతి పొందాలి. అంటే ఒక వ్యక్తి ముందున్నప్పడు మనం ఎలా ప్రవర్తిస్తామో, అదేవిధంగా ఉండాలి. ఎప్పడైతే ఆయన మనప్రక్కనే ఉన్నాడని దృఢంగా భావిస్తామో, అప్పుడు మనం పొందే అనుభూతి వర్ణనాతీతం. కొన్నిసార్లు మనం పులకించిపోయి రోమాంచిత స్థితికి చేరుకుంటాము. జీవితంలో అంతటి ఆనందం మరే ఇతర సాధన, కర్మ ఇవ్వలేదు. గుడిలోని పూజారి తాను ఆరాధించే విగ్రహాన్ని కేవలం ఒక శిలలాగా భావించడు. ప్రాణం ఉన్న భగవంతునిలా భావించును. కైంకర్య సమయాన చేతిగోరు తగిలినప్పుడు ఎంతో బాధపడుచు పరిహారము గావించును. ఒక్కొక్కసారి ఆ విగ్రహానికి ఏదైనా అపచారము కలిగితే ఆ పూజారి బాధ వర్ణనాతీతం. దుఃఖించును కూడా. అంటే అతడు ఆ విగ్రహములో సాక్షాత్తు భగవంతుణ్ణి చూస్తున్నాడన్నమాట. ప్రతి ఒక్కరు ఇలాగే భావించాలి. గాలిని, వెలుతురును, శబ్దమును ఏ విధంగా అయితే మనవద్ద ఉన్నాయని గుర్తిస్తామో అలాగే మనస్సు పెట్టి వెతికే భక్తునికి భగవంతుని అనుభూతి అదేవిధముగా కలుగుతుంది. భగవంతుడు మనవద్దనే ఉన్నాడన్నప్పడు మనం ఎంతో దివ్యానుభూతిని పొందెదము. ఎలాంటి చెడుపనులు కాని, ఒకరికి హాని కలిగే చర్యలు కాని చేయము. వీలైనంతవరకు మంచిపనులను, అందరికీ ఉపయోగపడే పనులను చేయుచు సదా ఆయన ధ్యానములోనే ఆయన దివ్య సమ్మోహన రూపమును చూచుచు “ప్రభూ! మీ కృపవల్ల, మీ చల్లని దీవెనల వల్ల మీ రూపమును గాంచుచు, మిమ్ములను స్మరించే భాగ్యాన్ని పొందాను. మరికొన్ని రోజులు జీవించినచో కేవలం మిమ్ములను చూచుటకు, అనుభూతి పొందుటకు, స్మరించుటకు మాత్రమే నా శేషజీవితమును అంకితము చేయుదు”నని ప్రతిజ్ఞ చేయుదాం.